జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, మెరుగైన ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం చేసేందుకు అధికారులు, శిక్షణ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు సూచించారు. గుంటూరు కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు గల్లా మాధవి గారు, బూర్ల రామాంజనేయులు గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ గారితో కలిసి స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ జనరేషన్పై సమీక్ష నిర్వహించారు.
DDU-GKY కింద గుంటూరు జిల్లాకు నిర్దేశించిన 9,000 మంది యువతను నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేసే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అర్హత కలిగిన యువతకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించాలని, శిక్షణ అనంతరం కెరీర్ అభివృద్ధి, నైపుణ్యాలు, ఆదాయం పెంచుకునే అవకాశాలను వివరించాలని సూచించారు. రానున్న సుమారు ఒకటిన్నర సంవత్సరానికి నిరంతర శిక్షణ బ్యాచ్లు నిర్వహించేలా లక్ష్యాలను కేటాయించినట్లు తెలిపారు. 9,000 లక్ష్యాన్ని మించి యువత ముందుకు వస్తే అవసరాన్ని బట్టి అదనపు శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ గారు మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారంలో మొదటి విడత శిక్షణ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల స్థాయిలో రిజిస్ట్రేషన్ క్యాంపులు నిర్వహించి అర్హులైన నిరుద్యోగ యువతను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఖాజావలి గారు, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి అభినవ్ గారు, జిల్లా నైపుణ్య శాఖ అధికారి సంజీవరావు గారు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రతినిధి చిత్రం: ఈ వార్తలో పేర్కొన్న కార్యక్రమానికి సంబంధించిన అసలు ఫోటో కాదు.
చిత్రం: Joe Crawford / CC BY 2.0. మూలం: https://commons.wikimedia.org/wiki/File:SanDiegoCityCollegeLearningResource_-_bookshelf.jpg
లైసెన్స్: https://creativecommons.org/licenses/by/2.0/
చిత్రం యథాతథంగా ఉపయోగించబడింది; పేజీ అమరికను బట్టి ప్రివ్యూ కత్తిరించబడవచ్చు.





