Titupathy: ఎస్వీ యూనివర్సిటీ రెండో గేట్ నుంచి మెయిన్ గేట్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్చార్జ్ భూమన అభినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.
తిరుపతి: రాజధాని నిర్మాణం పేరుతో అమరావతిలో తాము కొనుగోలు చేసిన భూముల విలువ పెంచుకునేందుకే రాయలసీమకు కేటాయించిన ప్రతిష్టాత్మక విద్యా, వైద్య సంస్థలను అమరావతికి తరలిస్తున్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి కోసం కేటాయించిన సంస్థలను ఒక్కొక్కటిగా అమరావతికి తరలించే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు తిరుపతిలో ఏర్పాటు చేయాల్సిన నైలెట్‌ను కూడా అమరావతికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తిరుపతిలో నైలెట్ ఏర్పాటు కోసం గతంలో ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి, సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరిగి కృషి చేశామని ఎంపీ గురుమూర్తి తెలిపారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చి తిరుపతిలో నైలెట్ ఏర్పాటు కోసం కృషి చేశామని చెప్పారు. ఇటీవల కూడా కేంద్ర మంత్రులను కలిసి నైలెట్‌కు శాశ్వత క్యాంపస్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరగా, వారు సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు.
అలాంటి సంస్థను ఇప్పుడు తిరుపతి నుంచి అమరావతికి తరలించేందుకు భూములు కేటాయించడం దుర్మార్గమైన నిర్ణయమని ఎంపీ గురుమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. రాయలసీమలో పుట్టి, ఇక్కడే పెరిగి, ప్రస్తుతం నైలెట్ కార్యకలాపాలు కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే చదువుకుని, ఇదే ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన చంద్రబాబు నాయుడు అదే రాయలసీమకు అన్యాయం చేయడం బాధాకరమని విమర్శించారు. తాను చదువుకున్న విశ్వవిద్యాలయానికి, తాను ప్రాతినిధ్యం వహించిన ప్రాంతానికే వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాయలసీమ విద్యార్థులు, యువత భవిష్యత్‌ను దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎంపీ స్పష్టం చేశారు. రాయలసీమకు ఒక్క మంచి పని చేయకపోగా, గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతానికి సాధించిన విద్యా సంస్థలను కూడా అమరావతికి తరలించుకుపోవడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందని అన్నారు.
వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా, వైద్య సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక విద్యార్థులు, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఎంపీ గురుమూర్తి అన్నారు. అందుకు భిన్నంగా అన్ని సంస్థలను ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వల్ల ప్రాంతీయ అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే తొమ్మిది ప్రతిష్టాత్మక ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 24 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్న నేపథ్యంలో, ఈ ప్రాంత విద్యార్థులు, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సింది పోయి వారి భవిష్యత్‌ను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. నైలెట్ తరలింపు అంశాన్ని పార్లమెంటు వేదికగా ప్రశ్నిస్తామని ఆయన తెలియజేశారు.


