బుధవారం కలెక్టరేట్‌లో ‘ఇన్వెస్ట్ కడప’ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గారు, సబ్ కలెక్టర్ హెచ్‌.ఎస్‌. భావన గారితో కలిసి ప్రారంభించారు.

పెట్టుబడిదారులకు భూమి, నీరు, విద్యుత్, రహదారులు, అనుమతులు తదితర అంశాల్లో ఒకే వేదిక ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ గారు తెలిపారు. పెట్టుబడి ఆలోచన నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వివిధ శాఖలతో సమన్వయం చేస్తామని చెప్పారు.

జిల్లాలోని భూములు, వనరులు, మౌలిక వసతుల వివరాలను డిజిటల్ వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చామని, గత ఐదేళ్ల గణాంకాలను కూడా ఒక్క క్లిక్‌తో తెలుసుకునేలా ‘ఇన్వెస్ట్ కడప’ను రూపొందించామని తెలిపారు. పరిశ్రమలతో పాటు పునరుత్పాదక ఇంధనం, గనులు - ఖనిజాలు, పర్యాటకం, వాణిజ్యం తదితర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్నారు.

స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు త్వరలో ‘స్టార్టప్ కడప’ను ప్రారంభించి యువ ఔత్సాహికులను ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్ గారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.